రిజర్వేషన్ల దగ్గర వ్యతిరేకత – అధికారం దగ్గర ఐక్యతనా? అని ప్రశ్నించిన ముదిరాజ్ నాయకులు
తెలంగాణ ప్రతిక, బీబీపేట్ (కామారెడ్డి జిల్లా): బీసీ రాజ్యాధికారం పేరుతో ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తే సహించబోమని కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. బీబీపేట్ మండలానికి చెందిన కొరివి నర్సింలు ఈ ప్రకటన విడుదల చేశారు.
బీసీ రాజ్యాధికారం అనే నినాదంతో ముందుకు వస్తున్న నాయకులకు, బీసీ సమాజానికి ముదిరాజుల సందేశంగా ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
“ద్వంద్వ వైఖరి వీడండి”
రాజ్యాధికారం కంటే ముందు ప్రతీ బీసీ కులానికి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం, సామాజిక భద్రత లభించాలన్నది ప్రాథమిక సూత్రం. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ద్రోహాన్ని, వివక్షను దాచిపెట్టి ఓట్ల కోసం ఐక్యత నాటకాలు ఆడటం ఏ రకమైన సామాజిక న్యాయమని ప్రశ్నించారు.
- రిజర్వేషన్ల దగ్గర వ్యతిరేకత – అధికారం దగ్గర ఐక్యతనా?
ముదిరాజులను బీసీ-ఏ (BC-A) జాబితాలోకి చేర్చి, వారికి రావాల్సిన చట్టబద్ధమైన రిజర్వేషన్ హక్కులను కల్పించడానికైతే బీసీలలోని కొందరు నాయకులు మరియు బీసీ-ఏ కులాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయని, కానీ ఎన్నికలు, పదవులు, “బీసీ రాజ్యాధికారం” అనగానే మాత్రం “ముదిరాజులు మన సోదరులే, అందరం ఒకటైదాం” అని తీపి మాటలు చెబుతారని విమర్శించారు. హక్కులు ఇవ్వడానికి మనస్కరించని నాయకులు, ఓట్లు మరియు సంఖ్యా బలం కోసం ముదిరాజులను కలుపుకొని పోవాలని చూడటం స్వార్థమని, ఈ ద్వంద్వ నీతిని ముదిరాజ్ సమాజం స్పష్టంగా గమనిస్తోందని పేర్కొన్నారు. - హక్కులను తొక్కిపెట్టి వాడుకునే ఓటు బ్యాంకు రాజకీయాలు:
ముదిరాజుల నోటికాడి కూటిని, వారికి దక్కాల్సిన సామాజిక న్యాయాన్ని అడ్డుకుంటూ… రాజ్యాధికారం పేరుతో వారి జనాభా బలాన్ని వాడుకోవాలని చూడటం ముదిరాజులను వంచించడమేనని అన్నారు. మన హక్కులు, రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు పట్టించుకోని నాయకులు, రాజ్యాధికారం అనే పెద్ద పదాన్ని తెరపైకి తెచ్చి అసలు చర్చను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాథమిక రిజర్వేషన్ హక్కుల్లోనే ద్రోహం చేస్తూ, అధికారం కోసం మాత్రమే ఉపయోగించుకుంటామంటే ఏ ముదిరాజ్ ఆత్మగౌరవం అంగీకరించదని స్పష్టం చేశారు. - సామాజిక న్యాయం లేని చోట రాజ్యాధికారం సాధ్యం కాదు:
బీసీ లోపల ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దకుండా, ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన రిజర్వేషన్ వాటాను అంగీకరించకుండా ఏ ఐక్యతా నిలబడదని, అంతర్గత న్యాయం జరగనంత వరకు, ముదిరాజుల రిజర్వేషన్ డిమాండ్లకు పూర్తి మద్దతు లభించనంత వరకు ఈ “బీసీ రాజ్యాధికారం” అనే నినాదం కేవలం ఒక పొలిటికల్ గిమిక్ మాత్రమేనని పేర్కొన్నారు.
మా స్పష్టమైన హెచ్చరిక: ముదిరాజుల హక్కులను కాలరాస్తూ, వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని, ముదిరాజులను బీసీ-ఏ లోకి చేర్చేలా మరియు వారికి సముచిత భాగస్వామ్యం దక్కేలా మద్దతు ఇచ్చి సామాజిక న్యాయాన్ని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. మా రిజర్వేషన్లు – మా హక్కులు సిద్ధించిన తర్వాతే ఏ ఐక్యతైనా, ఏ రాజ్యాధికారమైనా అని తేల్చి చెప్పారు.
