తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల: పాము కాటుకు గురైన మహిళ వైద్యం విషయంలో సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఇచ్చారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ ఆరోపించారు.
నిన్న సాయంత్రం ఒక మహిళకు పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుబాటులో ఉందో లేదో తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ కు ఫోన్ చేశారు.
ఆదివారం కావడంతో పాము కాటు వైద్యులు అందుబాటులో ఉన్నారా అని అడగగా “మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు?” అంటూ సమాధానం ఇచ్చారని వినోద్ తెలిపారు.
ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడికే ఇలాంటి సమాధానం వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఈ సూపరింటెండెంట్ ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అరకల రమేష్, కార్మిక విభాగం అధ్యక్షుడు కోడూరు శ్రీహరి, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి నరేందర్, మండల అధ్యక్షులు లక్కపాక రాకేష్, గుండేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
