కేటీఆర్ అభినందనలు.. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా
తెలంగాణ పత్రిక, రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వంశికను కలిసిన కేటీఆర్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వంశిక ఇప్పటివరకు క్రికెట్‌లో సాధించిన విజయాలు, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విధానం, భవిష్యత్తు లక్ష్యాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వంశికకు భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతో కూడిన ఉమ్మడి జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన వంశిక తన నాయకత్వ ప్రతిభతో జట్టును సెమీఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. బౌలింగ్‌లోనూ రాణించి ప్రశంసలు అందుకుంది.
వచ్చే నవంబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక తెలంగాణ తరఫున బరిలోకి దిగనుంది. గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదువుకుంటూ జాతీయ స్థాయికి ఎంపిక కావడం నామాపూర్ గ్రామంతో పాటు పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
వంశిక విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు కుంట శ్రీనివాస్‌తో పాటు ఆమెను ప్రోత్సహించిన పాఠశాల ఉపాధ్యాయులను పలువురు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ వంశిక అద్భుత ప్రదర్శన చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
