తెలంగాణ పత్రిక, దమ్మన్నపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.

GYS ఆవిష్కార్ అవార్డ్స్–2026లో భాగంగా నిర్వహించిన రెండో దశ ఆన్‌లైన్ సైన్స్ ఫెయిర్‌లో పాఠశాలకు చెందిన లింగాల సంజన, భూక్య తేజస్విని రూ.2,500 నగదు ప్రోత్సాహక బహుమతిని గెలుచుకున్నారు.

ఈ నెల 12వ తేదీన ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 86 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దమ్మన్నపేట విద్యార్థినులు తమ గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్ మార్గదర్శకత్వంలో రూపొందించిన ‘స్టూడెంట్ ఫ్రెండ్లీ స్మార్ట్ వాటర్ బాటిల్’ ఆవిష్కరణను ప్రదర్శించి ఈ విజయాన్ని సాధించారు. పోటీల ఫలితాలను తాజాగా ప్రకటించగా వీరు బహుమతికి ఎంపికయ్యారు.

వచ్చే నెల 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థినులకు బహుమతి ప్రదానం చేయనున్నారు.

విద్యార్థినుల విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులను, వారికి మార్గదర్శకత్వం వహించిన గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్‌ను అభినందించి జ్ఞాపికను అందజేశారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు జాతీయ స్థాయిలో బహుమతి సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.